సంగారెడ్డి జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారితో సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు,దివ్యాంగుల సంఘాలు ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రతినెల మొదటి శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సదరన్ సమస్యలపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ కొరకు, రెన్యూవల్ కొరకు సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. సదరం క్యాంపులో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్ లో సిటిజన్స్ స్లాట్ బుకింగ్ సదుపాయం
ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్, నిర్వహించాలన్నారు.
వెయిటింగ్ ఇబ్బందులను తొలగించే చర్యలు అధికారులు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డిఆర్డిఏ అధికారులు సమన్వయంతో దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. శనివారం, సోమవారం ప్రజావాణి కి వచ్చే దివ్యాంగుల కొరకు వీల్ చైర్లు ఏర్పాటు, బ్యాటరీ ఆటో ట్రాలీ ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డి డబ్ల్యు ఓ, లలిత కుమారి, పిడి డిఆర్డిఏ జ్యోతి, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ అనిల్ కుమార్, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు అడివయ్య, బసవరాజ్ , జుబేదా, ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, రాయికోటి నర్సింలు, సునీల్, మహేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






