రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత కొ త్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆశావాహుల ఆశలు మరోసారి చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉన్నాప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఏడాది క్రితం అంటే 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు ఆరు గ్యారంటీలతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించింది. నిజానికి ఆరు గ్యారెంటీల కంటే కూడా కొత్త రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.
ఈసారైనా పక్కానా?
రేషన్ కార్డుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం అలా ఉంటే ఇకకొత్త ప్రభుత్వం వచ్చాక అదిగో ఇదిగో అంటూ మంత్రులు లీకులు ఇస్తూ ఊరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ విషయంలో కీలక ముందడుగుగా రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అవుతుంటే గత సెప్టెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెరపైకి వస్తోంది.
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలి డిజిటల్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటిని ఒకే కార్డు ద్వారా అందించాలని భావిస్తోంది. ఈ అంశంపై వైద్యారోగ్య, పౌరసరఫరాల శాఖ అధికారులతో గతంలోనే సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును సైతం లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని, పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.








