తెలంగాణలో అధికారం కోసం దశబ్ద కాలపు నిరీక్షణకు సరిగ్గా ఏడాది క్రితం తెరపడింది. బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతూ హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కాలంలో అనేక నిర్ణయాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం నడిపింది. నిర్ణయాలలో దూకుడుగా వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఏడాది కాలం గడిచినా ఒక్క విషయంలో ఎదురుచూపు తప్పడం లేదు. దీంతో వెయిటింగ్ పిరియడ్ కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు ఇక ఆఖరు అస్త్రాని ప్రయోగించారా? అంటే శనివారం జరిగిన పరిణామాలు ఎస్ అనే అంటున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో నేరుగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ రకరకాల కారణాలతో కేసీఆర్ మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదు. బడ్జెట్ సెషన్ లో సభకు హాజరైన ఆ రోజున అక్కడ డిబేట్ కు ఆస్కారం లేదు. దాంతో ఎల్లుండి జరగబోయే అంటే ఈ నెల 9న జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ను రప్పించాలని రేవంత్ వ్యూహత్మాకంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ నల్గొండ సభలో కేసీఆర్ విషయంలో తన వ్యాఖ్యలను పీక్స్ కు చేర్చారు రేవంత్ రెడ్డి. ఓడిపోగానే ఫామ్ హౌస్ లో పడుకుంటామనడం కేసీఆర్ కు అయన హోదాకు మంచిది కాదని విమర్శించారు. అంతటితో ఆగకుండా గతంలో మేమూ ఒకటి కాదు రెండు సార్లు ఓడిపోయాం. అంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉన్నమా? అంటూ విమర్శలకు పదును పెంచారు. మరో అడుగు ముందుకు వేస్తూ జానారెడ్డి, భట్టి విక్రమార్క ను ఉదాహరణగా చుపిస్తూ ప్రతిపక్ష నాయకుడి పదవికి న్యాయం చేయాలని.. అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేయారు. ఇక ఎల్లుండి జరగబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరపున బృందాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ కే పంపించారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఉదయం, విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం సాయంత్రం జరగనున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి రారు. అక్కడికి రాకుండా విగ్రహఆవిష్కరణకు వచ్చే పరిస్థితే లేదు. దాంతో ఈ రెండింటికి ఆయన ఎలాగూ రారని భావించే రేవంత్ రెడ్డి కేసీఆర్ పై టెంపో పెంచారానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి తనను ఎంతలా రెచ్చగొట్టినా కేసీఆర్ తన వ్యూహం విషయంలో పక్కాగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి పోవడం పార్టీకి, తన ప్రతిష్టపై అధికార పక్షం ఎటాక్ చేయవచ్చు. విగ్రహం విషయంలో బిఆర్ఎస్ స్థాండ్ ఏంటో బహిరంగ రహస్యమే. తనను రేవంత్ ఎంతలేసి మాటలు అన్నా అది తనకు సానుభూతిగానే మారుతుంది అనేది కేసీఆర్ ఆలోచన కావొచ్చు. ఇక విగ్రహఆవిష్కరణకు ఆహ్వానించడానికి తన ఫామ్ హౌస్ కు వచ్చిన బృందానికి భోజనం పెట్టి పంపించారు కేసీఆర్. తన వద్దకు వచ్చిన వారికి మర్యాద చేయడం ఆయనకు సానుకూలమైన అంశం అనే టాక్ వినిపిస్తున్నది. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ డిబేట్ ను ఎంజాయి చేద్దాం అనుకునే ఇరు పార్టీల అభిమానులకు మాత్రం ఆ అదృష్టం ఇప్పుడేనా లేక మరెప్పుడైనానా అనేది అంతు చిక్కని ముచ్చటగా మారింది.








