పటాన్ చేరు నియోజకవర్గం రాజకీయం మరోసారి నిప్పులు కక్కుతున్నది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గ పోరు పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి తిరును నిరసిస్తూ ఇవాళ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడంతో రాజకీయం కొత్తమలుపు తీసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ట్విస్ట్ ఇచ్చిన మహిపాల్ రెడ్డి:
ఈ దాడిపై స్పందించిన మహిపాల్ రెడ్డి ఇది చీప్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఇదంతా కాటా శ్రీనివాస్ గౌడ్ చేయించారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేయాలని అంటే ఎలా అని ప్రశ్నించారు. క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ ఓపెన్ అయిపోయారు. మాజీ సీఎం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నేత ఫోటో పెట్టుకుంటే తప్పేంటి ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం పెట్టుకోకపోవడం నా ఇష్టం అని కుండ బద్దలు కొట్టేశారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని పోలుసులను కోరారు. కాటాను ప్రజలు రెండు సార్లు ఓడించినా అయినా ఇంకా బుద్ది తెచ్చుకోవడం లేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయారు.
ఎన్ని కేసులైన పెట్టుకో మహిపాల్ రెడ్డి..: కాటా
ఈ వ్యవహారం పై స్పందించిన కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని కార్యకర్తలు ప్రశ్నించారని అన్నారు.ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ కార్యాలయంలో పెట్టాల్సిందే. మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి. కాంగ్రెస్ లో చేరానని చెప్తావ్, కండువా వేసుకోవు. కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వవు. ఇదంతా ఏంటి అని ప్రశ్నించారు. సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరడంలో నాకు ఎలాంటి తప్పు కనబడటం లేదు. దాడి జరిగి ఉంటే అది తప్పు అన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. భయపడేది లేదు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నారు.
దీంతో కొత్త పాత లీడర్లతో సతమతం అవుతున్న తరుణంలో ఇరువురు నేతలు అధిష్టానం వద్దే తేల్చుకుంటాం అని తెగేసి చెప్పడంతో ఎం జరగబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇంతకు వీరి విషయంలో అధిష్టానం ఆలోచన ఎలా ఉండబోతున్నది అనేది తెలియాలంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రావాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.






