మొత్తానికి సస్పెన్స్ కు తెరపడింది. చాలా మంది ఊహించినట్లే ఘంటా చక్రపాణికి రేవంత్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఘంటా చక్రపాణి నియమితులు అయ్యారు. ప్రభుత్వ సిఫార్సుతో చక్రపాణి పేరును ఖరారు చేస్తూ శుక్రవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఇంత వరకు ఓకే. కానీ బిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతారు అనే భావన ఉన్న ఘంటా చక్రపాణికి ఈ కీలక పదవి అప్పగించడం వెనుక విపక్షంలోనే కాదు స్వపక్షంలోనూ పెదవి విరుస్తున్న వారు ఉన్నారు. అయితే ఈ సంగతులు అన్నీ తెలిసినా రేవంత్ రెడ్డి మాత్రం పక్కగానే ఈ ఎంపిక చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ ఏర్పడ్డాక ఈ రాష్ట్రానికి TGPSC కి తొలి చైర్మన్ గా కేసీఆర్ ఘంటా చక్రపాణిని పికప్ చేశారు. ఈ పదవికి ఆయనేమీ అనర్హుడు కాదు. విద్యావేతగా, జర్నలిస్ట్ గా, రచయితగా, సామజిక విశ్లేషకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహారించారు. అయితే కేసీఆర్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలను బహిరంగగానే స్వాగతించారు. దీంతో ఆయనపై బిఆర్ఎస్ ముద్ర వేశారు. అయితే ఇటీవల రేవంత్ సర్కార్ తీసుకున్న కొన్ని అంశాలను సైతం సమర్తించారు. దీంతో ఇన్నాళ్లు తమ పక్షమే అని భావించిన బిఆర్ఎస్ ఒక్కసారిగా తిరగబడింది.పదవి కోసమే పెదవులు మూసుకున్నాడు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది. ఇదే సమయంలో లగచర్ల ఘటనను ఘంటా విమర్శించారు. అంతకు ముందు పలువురిని అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టారు. దీంతో ఘంటా పై కాంగ్రెస్ అభిమానులు సైతం విమర్శలు గుప్పించారు. తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్న చందంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మదిలో ఆలోచనలు ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం ఘంటా చక్రపాణిని పరిగణలోకి తీసుకున్నారు.
ఈ దెబ్బతో తమ ప్రత్యర్థులపై రేవంత్ రెడ్డి బ్రహ్మాస్ట్రాన్ని ప్రయోగించినట్లు అవుతుంది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పోస్టింగ్ ల విషయంలో గత ప్రభుత్వంలో మాదిరిగా పైరవీలు చేయడంలేదని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్థావిస్తున్నారు. ఈ వాదనను బలోపేతం చేసేందుకు సుధీర్ఘ కాలం యూనివర్సిటీతో సంబంధం కలిగిన ఘంటా చక్రపాణిని నియమించామని చెప్పడం ఒక ఉద్దేశం కావొచ్చు. ఇక పార్టీలు, సిద్ధాంతలు, అభిప్రాయాలకు సంబంధం లేకుండా తమ ప్రభుత్వం నియామకాలు చేపడుతున్నది అని సంకెతాలు ఇవ్వడం కావొచ్చు. మొత్తంగా నియామకాల విషయంలో ఘంటా చక్రపాణి ఎంపిక కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విసిరిన ఒక ఆయుధం అనే ముచ్చట్లు వినిపిస్తున్నాయి.








